కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాక బోరు ఎండేది లేదని.. బాయి దంగేది లేదని మోటార్ వైండింగ్, జనరేటర్, ఇన్వర్టర్ దుకాణాలు, బోరు బావుల బండ్లు బంద్ అయ్యాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సాగు జలాల సౌకర్యం మెరుగవ్వడంతో.. వలస వెళ్లినవాళ్లు తిరిగి వస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం జక్కాపూర్ గ్రామంలో రెండు పడక గదుల ఇళ్లు, ప్రకృతి వనం డంపింగ్ యార్డు, వైకుంఠధామం, వివిధ కుల సంఘాల భవనాలను జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, పెన్షన్లు, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. జక్కాపూర్ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో బడుగు బలహీనవర్గాలకు, సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఎస్సీలకు కేటాయించిన ఇళ్ల స్థలంలోనూ భవిష్యత్తులో రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్రాలగొంది గ్రామంలోని చెరువులో చేప పిల్లలు వదిలారు.