సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. గ్రామంలోని గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులను జడ్పీ ఛైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మతో కలిసి వేశారు. మేకలు, గొర్రెలు పెంపకం చేసే కాపలాదారులు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. ఎలాంటి వ్యాధులు వ్యాపించినా... వెంటనే పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. మేకల, గొర్రెల పెంపకంతో రైతులు మరింత ఆర్థికాభివృద్ధి చెందుతారని సూచించారు.
గంగాపూర్ గొర్రెల హాస్టల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. వాటిని సరిచేసుకోవాలన్నారు. ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. షెడ్డులోనే గొర్రెల కాపరులు ఉండేందుకు వీలుగా షెడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి భరోసా ఇచ్చారు. గంగాపూర్ స్వచ్ఛ గ్రామం అయ్యేలా అందరూ కృషి చేయాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు షెడ్లు సందర్శిస్తూ... ఎప్పటికప్పుడు మూగ జీవాల ఆరోగ్య పరిస్థితి పరీక్షించాలని మంత్రి ఆదేశించారు.