కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సంక్షేమం ఆపలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గోనెపల్లిలో పర్యటించిన మంత్రి... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.14 లక్షల 80 వేల వ్యయంతో నిర్మించిన రెండు అదనవు తరగతి గదులు, రూ. 20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, కషాయ వితరణ కేంద్రం, 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
గ్రామ పంచాయితీ కోసం ఇళ్లు ఇచ్చిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి... ప్రభుత్వ సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. గ్రామానికి కావాల్సిన అభివృద్ధికై దశల వారీగా కృషి చేస్తానని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరోనా కష్ట సమయంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవీ ఆపలేదని... ఆసరా పింఛన్లు, రైతుబంధు పెట్టుబడి సాయం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ తదితర సంక్షేమ కార్యక్రమాలకు ఏ లోటు రాకుండా అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.