ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌లో అడుగు పెట్టడమే గజ్వేల్ ప్రజల అదృష్టమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (HARISH RAO) తెలిపారు. సీఎం ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ దిశ మారిందని... ప్రజలు కలలో కూడా ఊహించనంత అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రూ.7 కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ భవనాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. అంతకుముందు గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం, షాదీఖానా భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. నీళ్ల కోసం గోస పడ్డ గజ్వేల్ ప్రజలకు.. నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు, తాగు, సాగునీటి కష్టాలను సీఎం దూరం చేశారన్నారు.
విదేశీ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు గజ్వేల్ అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు వస్తున్నారని... రూ.500 కోట్లతో గజ్వేల్ మాదిరిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. సీఎం సారథ్యంలో సంగాపూర్ సింగపూర్‌గా మారిందన్నారు. నూతన మున్సిపల్ భవనం ఎంత సుందరంగా ఉందో... గజ్వేల్‌ని అంత సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. ప్లాస్టిక్ చెత్త రహిత క్లీన్ పట్టణంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పట్టణ అభివృద్ధి వీడియో పాట ద్వారా కళ్ల ముందు ఉంచిన సంతోష్ బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ రోజా శర్మ, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తీవ్ర ఇన్ఫెక్షన్కూ భారతీయ టీకాలు చెక్!