సిద్దిపేటలో ఈ నెల 20న సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని మంత్రి సూచించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్, సామాగ్రిని కేటాయించిన స్థలాలకు తరలించాలని దిశా నిర్దేశం చేశారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పలు శాఖలకు కేటాయించిన విభాగాలకు తరలించిన సామాగ్రిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఆర్వోబీ చెన్నయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.