కరోనా వచ్చిన వారికి వ్యాధి నయం చేయడంతో పాటు, కరోనా రాకుండా ప్రాథమిక దశలోనే కట్టడి చేయాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రి హరీశ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, లాక్డౌన్ అమలుపై అధికారులతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొని కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్ చేయాలని ఆదేశించారు. ఒక గదే ఉన్నవారికి ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హల్లు, రైతు వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలను దగ్గరుండి మానవతా దృక్పథంతో నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్, సర్పంచ్లను కోరారు. అవసరమైతే గ్రామ పంచాయతీ నిధులు వాడుకోవడానికి అనుమతిస్తామని అన్నారు.
లాక్డౌన్ అమలును కఠినంగా, పకడ్బందీగా అమలు చేయాలని ప్రజలంతా అధికారులకు సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేయక లారీలు ఆగిపోయాయని, రైతులు ఇబ్బంది పడుతున్నందున ధాన్యం కొనుగోలుపై సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
- ఇదీ చదవండి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: డీకే అరుణ