సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాల్వల నుంచి మంత్రి హరీశ్ రావు నీటిని విడుదల చేశారు. మల్లన్నసాగర్ నాలుగో గేట్ ద్వారా ఈఎన్సీ హరిరామ్ నీటిని విడుదల చేశారు. కాల్వల్లో నీటిని చూసి రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నామని హరీశ్ రావు అన్నారు. రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకునే రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి కాల్వలో ఈత కొట్టి పులకించారు.
ఇక నుంచి ఆత్మహత్య, కరవు అనే పదాలు వినిపించవని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రంగనాయక్‌సాగర్ ద్వారా ఏడాదంతా నీళ్లు వస్తాయని వెల్లడించారు. కుడికాల్వ ద్వారా 40 వేలు, ఎడమ కాల్వ ద్వారా 70 వేల ఎకరాలు సాగవుతాయని తెలిపారు. సిద్దిపేట వాగు కింద 28, నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్‌డ్యాంలు, శనిగరం చెరువు నింపుతామన్నారు. వర్షాకాలంలోగా పిల్ల కాల్వలు పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎంత దూరమైనా రైల్ టికెట్ 50రూపాయలే.!