Harish inspection at Hospital: మనమంతా ప్రజా సేవకులమని.. వారి కోసం కలిసి పని చేయాల్సిన బాధ్యత మనపై ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లిలోని పీహెచ్సీలో వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలపై మంత్రి ఆరా తీశారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్సులను ఆదేశించారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై స్థానిక ప్రజాప్రతినిధులతో ఆరా తీశారు. అంతకుముందు పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు.
'మనమంతా జీతగాళ్లం. నేనైనా, నువ్వైనా.. ప్రజలకు జీతగాళ్లం. కాబట్టి మనం సేవ చేయాలి. సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. మనం ప్రజా సేవకులం. వారి కోసమే పనిచేయాలి. నా జీతం 2 లక్షలు. స్టాఫ్ నర్సుగా నీ జీతం 77 వేలు. నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా. నార్మల్ డెలివరీ చేయడానికి స్టాఫ్ నర్సు చాలు. భద్రాచలంలో వైద్యుడు లేకుండానే ఒక్కరే స్టాఫ్ నర్సు రోజుకు 20 డెలివరీలు చేస్తున్నారు. మనం కూడా నార్మల్ డెలివరీలు చేయాలి.' - హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
అనవసరంగా ఆపరేషన్లు చేయొద్దని.. సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్టాఫ్ నర్సులకు దిశానిర్దేశం చేశారు. మహిళల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళల ఆరోగ్యాలతో వ్యాపారం చేయొద్దని హెచ్చరించారు. ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నా కూడా ఓపీలు తక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో సిబ్బంది తప్పకుండా అందుబాటులో ఉండాలని హరీశ్ రావు ఆదేశించారు. అంతే కాకుండా ఆస్పత్రిలో ప్రతి రోజు ఎంతమందికి సేవలందిస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. కరోనా సమయంలో అందరం కలిసి కష్టపడ్డామని తెలిపారు. ప్రజలతో మమేకంగా ఉండి వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పీహెచ్సీ పరిధిలో 35 మంది గర్భిణీలు ఉంటే ఒకరు మాత్రమే ప్రైవేటులో డెలివరీ అయ్యారని మంత్రికి సిబ్బంది వివరించారు.
మందులపై ఆరా: పాముకాటు, తేలు కాటు మందులు, సూదులు ఉన్నాయా అని వైద్య సిబ్బందిని హరీశ్ రావు ప్రశ్నించారు. కుక్కకాటుకు ఎవరైనా వస్తే వెంటనే చికిత్స అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఆస్పత్రిలోని 21 మంది స్టాఫ్ ఉంటే 21 మంది పేషేంట్లే ఉంటారా? అని సిబ్బందిని మందలించారు. గత నెలలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండి కూడా ఒకే కాన్పు చేయడమేంటనీ హరీశ్ రావు నిలదీశారు. బీపీ కంట్రోల్ చేయకపోతే కిడ్నీలు పాడవుతున్నాయని, షుగర్ మందులు, బీపీ మందులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి: Kishan Reddy On Kcr: 'కేసీఆర్.. ఫ్రంట్‌లు, టెంట్‌లు పెట్టుకోవచ్చు'
'అవి సైనికుల అస్థిపంజరాలే'.. పరిశోధనలో సీసీఎంబీ నిర్ధరణ