నిరుపేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ ఆడిటోరియంలో 5వ దఫాలో 192 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా... నిరుపేదలకు సర్కారు రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నర్సాపూర్‌లో 2,460 రెండు పడక గదుల ఇళ్లను సకల సౌకర్యాలతో పూర్తి చేశామన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
తొలి విడత ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 144 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారన్నారు. రెండో విడత 180 మందికి, మూడో విడత 216 మందికి, నాలుగో విడత 168 మందికి, ఐదవ విడత 192 మందికి పట్టాల పంపిణీ చేశామన్నారు. ఇంకా మిగిలిన 1,000 ఇళ్లకు సంబంధించి పున: పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!