
ఇటీవల కాలంలో రాత్రి.. పగలు అనే తేడా లేకుండా రహదారులు రక్తమోడుతున్నాయి. కారణాలేవైనా రహదారి ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులుగా మారి.. ఆసుపత్రుల పాలవుతున్నారుపలు ఉదంతాలు సాధారణ ప్రయాణికుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహనాల అతివేగానికి కళ్లెం వేస్తూ.. చోదకులను అప్రమత్తం చేసేలా అధికారులు కదిలారు. జిల్లా పరిధిలో రాజీవ్ రహదారి వద్ద ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించి నివారణ దిశగా చర్యలు వేగిరం చేసింది. ఈ నెలలో బ్లాక్‌స్పాట్‌ల వద్ద ఒక్క ప్రమాదమూ జరగకపోవడం విశేషం.
వేగాన్ని నియంత్రించేలా జిగ్‌జాగ్..
ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసుశాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. రహదారి భద్రతా కమిటీలో సిఫార్సుల మేరకు తొలుత బ్లాక్ స్పాట్‌లపై దృష్టి సారించింది. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో ట్రాఫిక్ రేడియం పైపు కోన్‌లు, ఎర్ర రంగు బారికేడ్లు, రేడియంతో కూడిన జిగ్‌జాగ్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహన చోదకులు వేగాన్ని తగ్గించుకుంటున్నారు. అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, వర్గల్, జగదేవపూర్, కుకునూరుపల్లి పోలీసు ఠాణా పరిధిలో సంబంధిత ట్రాఫిక్ ఉపకరణాలు ఏర్పాటు చేశారు. రాజీవ్ రహదారిని ఆనుకొని లింకు రోడ్ల వద్ద వేగ నియంత్రికలు, నియంత్రణ బోర్డులు, సూచికలు (బ్లింకర్లు) ఏర్పాటు చేయనున్నారు.
నిఘా కెమెరాలు పెంచే యోచన
గడిచిన 15 రోజులుగా బ్లాక్‌స్పాట్‌లు, ఇతర ప్రాంతాల వద్ద ప్రమాదాల సంఖ్య తగ్గిపోయింది. కుకునూరుపల్లి, ములుగు, గజ్వేల్ పోలీసు ఠాణాల పరిధిలో బ్లాక్ స్పాట్‌లలో కాకుండా వేరే చోట మొత్తం ఏడు ప్రమాదాలు జరిగాయి. మరోవైపు రాజీవ్ రహదారిపై ప్రధాన చౌరస్తాలు, బ్లాక్‌స్పాట్‌ల వద్ద సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో దాదాపు 80 సీసీ కెమెరాలు బిగించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్న తీరును గమనించి... తక్షణ చర్యలు తీసుకునేందుకు దోహదం చేశాయి.
ఇదీ చదవండిః రుణమాఫీపై అయోమయంలో అన్నదాతలు