ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నారు. ఇరవై రోజుల క్రితమే సీఎం పర్యటన సమాచారంతో చింతమడకలో సందడి మొదలైంది. తమ ఊరి బిడ్డ రాక కోసం గ్రామస్థులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణలో అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అభివృద్ధి పనులపై సూచనలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన కేసీఆర్ తన బాల్య మిత్రులను, గ్రామస్థులను పలకరించి త్వరలో మరోసారి గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్, గ్రామ సర్పంచ్లకు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో శాఖల వారీగా రంగంలోకి దిగిన అధికారులు గ్రామస్థుల ఆర్థిక స్థితిపై ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ, వ్యవసాయ, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖ, నీటి పారుదల శాఖలు గ్రామంలో పర్యటించి... ఆయా శాఖల వారీగా గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించారు.
పనుల్లో వేగం
ముఖ్యమంత్రి పర్యటన తేది ఖరారు కావడం వల్ల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే పది కోట్ల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం విడుదల చేశారు. మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రామంలోని పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలకు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తామన్న సీఎం హామీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని సైతం తిరిగి గ్రామానికి తీసుకువస్తున్నారు. దీనిపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబసభ్యులతో పర్యటన
కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి చింతమడకలో పర్యటించనున్నారని సమాచారం. గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు... బీసీ గురుకుల పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రోజంతా గ్రామంలో గడపనున్నారన్న సమాచారంతో అధికారులు తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3,600 మంది సామర్థ్యంతో రెయిన్ ప్రూఫ్ వేదికను నిర్మిస్తున్నారు. భద్రత పరంగా ఇబ్బందులు లేకుండా గ్రామస్థులందరికీ ఐడీ కార్డులు సైతం జారీ చేస్తున్నారు.
ఇదీ చూడండి : కొత్త పుర చట్టంలో పట్టణ ప్రజలకు వరాలు