సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌కు నీటిఎత్తిపోతకు రంగం సిద్ధమైంది. అనంతగిరి నుంచి 11వ ప్యాకేజీ పంప్ హౌజ్ ద్వారా రంగనాయక్‌సాగర్‌లోకి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరి నుంచి 11వ ప్యాకేజీ సర్జ్ పూల్‌లోని నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌లో ఐదు మీటర్లకు పైగా నీరు చేరింది. 23మీటర్లకు పైగా నీరు చేరితే పంపుల ద్వారా ఎత్తిపోస్తారు.
11వ ప్యాకేజీలో 134.34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంపులను అమర్చారు. ఎనిమిదో ప్యాకేజీలోని బాహుబళి పంపుల తర్వాత రెండో పెద్ద పంపులుగా వీటిని చెప్పుకోవచ్చు. ఒక్కో పంపు మూడు వేల క్యూసెక్కుల చొప్పున ఒక టీఎంసీ నీటిని ఎగువకు ఎత్తిపోస్తాయి. సర్జ్‌పూల్‌లోకి తగిన నీటి మట్టం చేరాక అన్నింటిని పూర్తిస్థాయిలో పరీక్షించి దశలవారీగా ఒక్కో పంపు నుంచి రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు.
మూడు టీఎంసీల సామర్థ్యంతో రంగనాయకసాగర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని పంటపొలాలకు నీరివ్వటంతోపాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు కూడా నీరు తరలిస్తారు. వచ్చే వారం రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.