సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామం నుంచి శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎడ్లబండ్లతో బయల్దేరి వెళ్లారు. గ్రామస్థులు సుమారు 50 ఎడ్లబండ్లను చూడచక్కగా అలంకరించి నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా గ్రామ శివారు వరకు చేరుకున్నారు. అనంతరం ఎడ్లబండ్లను ఆలయానికి సాగనంపారు.
జాతర విశిష్టత
గ్రామం నుంచి వీరశైవ లింగాయత్ లింగ బలిజ కులం నుంచి కాసర్ల బుచ్చయ్య అనే వ్యక్తి మొదటగా ఈ జాతరను ప్రారంభించారని గ్రామస్థులు తెలిపారు. ఎనభై ఏళ్ల క్రితం సంక్రాంతికి నెలరోజులు ముందుగా ఆయన ఉపవాస దీక్ష చేపట్టేవారని.. పండుగ రోజు గ్రామంలోని ప్రధాన వీధుల్లో దక్షిణ చేసుకుంటూ ఖడ్గాలు వేస్తూ ఈ బండ్ల జాతరను ప్రారంభించారని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అశోక్ బాబు తెలిపారు. బుచ్చయ్య రెండవ కుమారుడికి కొత్తకొండ అని పేరు పెట్టారని, అదే ఆనవాయితీని కొత్తకుండ కుటుంబసభ్యులు కొనసాగిస్తున్నారని వివరించారు. స్వయాన వీరభద్రుడే తమ గ్రామం నుంచి వెళ్తున్నాడని భావించి గ్రామస్థులు ఆయనను ఎదుర్కొని కానుకలు సమర్పించేవారని చెప్పారు. ఆ కానుకలను ఆయన తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పిస్తారని పేర్కొన్నారు.
వీరభద్రస్వామిని గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తమను, తమ పాడి పంటలను చల్లగా చూడాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం గ్రామస్థులు బండ్లను ఎడ్లను సమకూర్చుకొని జాతరకు తరలి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ చదవండి: శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఉట్టిపడిన పల్లె వాతావరణం