Harish Rao Fires on BJP and Congress : ముఖ్యమంత్రి కేసీఆర్ జనాలను నమ్ముకుంటే, బీజేపీ ఏమో జమిలి ఎన్నిక(Jamili Elections)లను నమ్ముకుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు హరీశ్ శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరిని అడిగినా హ్యాట్రిక్ కేసీఆర్‌దే అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ వాళ్లు రోజుకో మేనిఫెస్టో.. రోజుకో డిక్లరేషన్ ఇస్తున్నారని ఆరోపించారు. 50 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నా.. వారు ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
Harish Rao Reaction on Jamili Elections : సీఎం కేసీఆర్ ఏం చెప్పారో అది చేసి చూపించారని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు(Rythu Bandu), రైతు బీమా ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు కావాలో, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని వివరించారు. రాష్ట్రంలో కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఒకటి కూడా ఉండదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకున్న కేసీఆర్ ప్రభుత్వం వడ్లు కొన్నదని తెలిపారు. తిట్లు కావాలంటే కాంగ్రెస్‌కు, కిట్లు కావాలంటే కేసీఆర్‌కు ఓట్లు వేయలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకువచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌లు పాల్గొన్నారు.
"కాంగ్రెస్ పార్టీ రోజుకో హామీ.. రోజుకో డిక్లరేషన్ ఇస్తున్నారు. ఈ దొంగ డిక్లరేషన్ని ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నా. 50 సంవత్సరాలు అధికారంలో ఉంటే.. రైతులకు కరెంట్ ఇచ్చారా.. రైతు బంధు ఇచ్చారా.. రైతు బీమా ఇచ్చారా.. ఇలా ఏది ఇవ్వలేదు. అప్పుడు చేయలేనిది.. ఇప్పుడు చేస్తామంటే మా ప్రజలు కాంగ్రెస్‌ను ఎట్లా నమ్మాలి. తెలంగాణ సమాజం సెల్ఫ్ డిక్లర్ చేసుకున్నారు. మూడోసారి కేసీఆర్‌ని ముఖ్యమంత్రి చేయాలని. బీజేపీ నాయకులు భయపడుతున్నారు.. అందుకే ఈ మధ్య డ్రామా ఆడుతున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్నారు. దేశంలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతారని వాళ్లకి అర్థమయింది. అందుకే జమిలి కథ పెడుతున్నారు. జమిలి కాదు.. జనాలను నమ్ముకున్న వారే నిలబడతారు. "- హరీశ్‌రావు, తెలంగాణ ఆర్థిక మంత్రి