Harish Rao On Dalit Bandhu: దళితులు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎస్సీలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు చొప్పున దళితులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులే గ్రామంలో ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారని.. ప్రజలు సహకరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం బంజరుపల్లిలో నిర్వహించిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గ్రామ బొడ్రాయి, సారుగమ్మ అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
పేదలకు అండగా
రాష్ట్రంలోనే తొలి సోలార్ గ్రామమైన బంజరుపల్లి.. ఐక్యతకు చిహ్నమని, ఒకే మాట, ఒకే బాటలో నడిచే గ్రామమని హరీశ్ రావు తెలిపారు. గ్రామంలో 21 మంది దళిత కుటుంబాలకు పథకం వర్తించనున్నదని పేర్కొన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందేలా రూ. 7300 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తరగతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీశ్ చెప్పారు. అలాగే వైద్యంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు, సిద్దిపేటలో 900 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు వివరించారు.
"స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి. మీ కాళ్లపై మీరు నిలబడే విధంగా ప్రభుత్వం రూ. 10 లక్షలు అందిస్తున్నది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన కేసీఆర్ చేశారు. విద్య, వైద్యం కోసం పేదలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం." - హరీశ్ రావు, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి
దేశంలోని భాజపా పాలిత, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెళ్లికి రూ. 50 వేలతో ప్రారంభించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రూ. లక్షకు పెంచి.. ఇప్పటివరకు 10 లక్షల మంది ఆడపడుచుల పెళ్లిళ్లకు సాయం చేసినట్లు హరీశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: "సమానత్వంపై మాట్లాడుతున్న కేసీఆర్.. మోదీని ఎందుకు అడగలేదు.?"