Harish Rao on Crop Damage: సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాత్రి కురిసిన వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులను మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. అన్నదాతలకు అభయాన్నిస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి , ఆరుగాలం కష్టం చేసి పంట పండిస్తే చేతికందిన పంట వర్షార్పణమైందని రైతులు తమ గోడును మంత్రితో వెల్లబోసుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని వేడుకున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా: ఈదురు గాలులు, వడగండ్ల వానతో తీవ్ర నష్టం జరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా కూడా రెండు, మూడు వెలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయానికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఉచిత కరెంట్ రైతులకు అందించామని పునరుద్ఘాటించారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే మొదటి దశలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నిన్నటి వానతో ఇంకెంత నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
"వర్షం వల్ల జరిగిన పంట నష్టం కారణంగా కౌలు రైతులు చాలా బాధలో ఉన్నారు. నోటికాడి బుక్క జారిపోయినట్లు, తినే ముద్ద కిందపడిన పరిస్థితి రైతులకు వచ్చింది. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అధికారులు వివరాలు పంపించాలని ఆదేశించాం. ఏప్రిల్ నెలలో వడగండ్ల వాన పడి నష్టం వాటిల్లుతుంది కాబట్టి మనం ఒక నెల ముందుగానే పంటను వేసుకుంటే ఇలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. అందుకే వానాకాలం, యాసంగి పంటలను ఒక నెల ముందుగా వేసుకోవాలి. కాలమే మనకు కొన్ని నేర్పిస్తది. భవిష్యత్‌లో మనం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దిశగా కూడా ప్రభుత్వం కూడా పని చేస్తుంది." - హరీశ్‌రావు
రైతులు అధైర్య పడొద్దు: రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్లోనే వరి నాట్లు వేసి, కోతలు పూర్తి చేసి నష్టం నుంచి బయట పడ్డారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో కూడా నెల ముందుగా నాట్లు వేసుకుంటే వడగండ్ల బాధను తప్పించుకోవచ్చని రైతులకు సూచించారు. భవిషత్తులో నెల ముందుకు సీజన్ తీసుకొచ్చేలా ప్రభుత్వం కూడా రైతులకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు.
"నిన్న రాత్రి వడగండ్ల వాన పడి రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. రైతులను ఓదార్చి, రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పంట నష్టం వివరాలన్నీ వెంటనే నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. తొలి దశలో వడగండ్ల వాన పడి రైతు నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఎకరానికి రూ.10వేలు అందిస్తామని ప్రకటించారు. రైతులకు ధైర్యం చెబుతూ వివరాలన్నీ కూడా నమోదు చేయాలని కూడా అధికారులకు ఆదేశించాం. - హరీశ్ రావు, రాష్ట్ర మంత్రి
ఇవీ చదవండి: