రెండు మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట- హన్మకొండ ప్రధాన రహదారి వంతెనపై నుంచి మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత సంవత్సరం ఆగస్టులో ఇదే వంతెనపై నుంచి తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహించిన సమయంలో లారీతో సహా డ్రైవర్ కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ వాగుపై హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రామాల్లో కుంటలు, చెరువులు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోరుట్ల నియోజవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది. మెట్పల్లి మండలం జగ్గసాగర్, మెట్ల చిట్టాపూర్తో పాటు పలు గ్రామాల శివారులో రోడ్లపై నుంచి వరద నీరు భారీగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. మొన్నటి వరకు నీరు లేక చెరువులు కుంటలు ఖాళీగా ఉండగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండల్లా కనువిందు చేస్తున్నాయి.
ఇదీ చూడండి: Rescue: వాగులో చిక్కుకున్న కూలీలు... కాపాడిన యువకులు