సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి తుపాకులు ఎత్తుకెళ్లిన కేసులో అయిదుగురు పోలీసులపై ఉన్నత అధికారులు వేటు వేశారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం హోలీ రోజున పోలీస్‌స్టేషన్ నుంచి ఏకే-47తో పాటు మరో తుపాకీని అక్కన్నపేటకు చెందిన దేవుని సదానందం ఎత్తుకెళ్లాడు. గత నెల 6న అక్కన్నపేటలో అతను పక్కింటి వారిపై కాల్పులు జరుపగా అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో సదానందం స్టేషన్ నుంచి తుపాకులు దొంగిలించినట్టు తేలింది. దానితో తుపాకులు దొంగతనం జరిగిన రోజు స్టేషన్లో ఎవరెవరు విధుల్లో ఉన్నారో తెలుసుకుని.. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు అధికారులు వారిని సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన వారిలో హుస్నాబాద్ ఎస్సై సంజయ్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు సంపత్, మనోజ్, మణి.. కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు. మొత్తం మీద స్టేషన్ నుంచి తుపాకులు మాయం కావడం.. కాల్పుల ఘటనతో వెలుగులోకి రావడం ఐదుగురు పోలీసు అధికారులపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: 'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'