తెలంగాణలో 2023లో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. పార్టీ రాష్ట్ర సారథి బండి సంజయ్ (bandi sanjay prana Sangrama yatra)'ప్రజాసంగ్రామ యాత్ర' పేరుతో పాదయాత్రకు పూనుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆగస్టు 27న ప్రారంభమైన తొలిదశ ప్రజాసంగ్రామ యాత్ర.. ఈరోజు హుస్నాబాద్‌లో ముగియనుంది. తొలుత అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలనుకున్నా.. హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడడంతో... సభాస్థలిని హుస్నాబాద్‌కు మార్చారు.
36 రోజుల పాటు తొలిదశ యాత్ర..
తొలిదశ ప్రజాసంగ్రామ యాత్ర.. 36 రోజుల పాటు సాగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని.. 18 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 450 కిలో మీటర్లకు పైగా సాగింది. తన పాదయాత్రలో భాగంగా.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజాసమస్యలు సహా తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకుసాగారు. మధ్యలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. ఎన్నికల సందర్భంగా తెరాస ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించారు.
లక్ష మందితో బహిరంగ సభ..
అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో ప్రజాసంగ్రామ యాత్ర (bjp husnabad meeting) ముగింపు సభను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. ఈ సభకు లక్ష మందిని తరలించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. బండి సంజయ్ సైతం జనసమీకరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం చేసేందుకు కష్టపడి పనిచేశారని అదే ఉత్సాహంతో మరింత కష్టపడి హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధర్‌రావు, రాష్ట్రనేతలు పాల్గొనున్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని.. ఉదయం 10.30 గంటలకు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ప్రచార రథంలో పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర తొలిదశ పాదయాత్రను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. తొలిదశ యాత్రలో ప్రజల నుంచి లభించిన స్పందన, తెరాస వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణను బహిరంగ సభవేదికగా ప్రజలకు వివరించనున్నారు.
ఇదీచూడండి: Bjp Meeting: అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో భాజపా భారీ బహిరంగ సభ
BANDI SANJAY: 'దీపావళి లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే.. మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం'