Harish Rao Allegations on BJP : ఉద్యోగులపై భాజపా కపట నాటకాన్ని ప్రదర్శిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో దళితుల అభ్యున్నతికి రూ.2 లక్షల కోట్లు కేటాయించేలా భాజపా ఎంపీలు ఒత్తిడి తేవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భాజపాకు దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. దళితబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మాని రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కేంద్రంతో కొట్లాడాలన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. జీవో 317పై భాజపా నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆ ఉత్తర్వును తప్పుపట్టడం అంటే కేంద్రాన్ని, రాష్ట్రపతి ఉత్తర్వులను కించపరిచినట్లేనని అన్నారు. నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగాలు లభించేలా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317జీవో తీసుకొచ్చామని మంత్రి హరీష్ రావు వివరించారు. ఏపీలో అక్కడి ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తుంటే.. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను పరిమితిని కేంద్రం రూ.6 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూనే.. కేంద్రంపై, భాజపా నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు.
దళితులపై కపటప్రేమ
మార్చి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మందికి దళితబంధు అందిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దళితుల పట్ల కపట ప్రేమ నటిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, రైతుబంధు వంటి అనేక పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్న హరిశ్ రావు... అదే స్ఫూర్తితో దళితబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆయన సవాలు విసిరారు. తాము దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే.. భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితుల ఊచకోతలు జరుగుతున్నాయని ఆరోపించారు.
స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317జీవో తీసుకొచ్చాం. స్వార్థ ప్రయోజనాల కోసం భాజపా దీన్ని రాజకీయం చేస్తోంది. ఉద్యోగుల పట్ల భాజపాకు నిజమైన ప్రేమ ఉంటే.. రాబోయే బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితిని రూ.6లక్షల రూపాయలకు పెంచాలి. దీని వల్ల రాష్ట్రంలో 50శాతం మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. తెరాస ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాల్లో కోతలు విధిస్తే.. మేం 30శాతం పెంచాం.
-హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి
జ్వర సర్వేతో కరోనా కట్టడి
కరోనా మహమ్మారిని అరికట్టేందుకే ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే చేపట్టిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా రెండో దశలో చేపట్టిన జ్వర సర్వేను కేంద్రం సహా నీతి ఆయోగ్ ప్రశంసించిందన్నారు. సిద్దిపేట 37వ వార్డులో అర గంటకు పైగా పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. పలువురికి స్వయంగా కొవిడ్ మందుల కిట్లు అందించి, అవి ఎలా వాడాలో వివరించారు.
‘‘నిత్యం లక్షకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. 2 కోట్ల పరీక్షల కిట్లు, కోటి మందుల కిట్లు అందుబాటులో ఉన్నాయి. 27 వేల ఆక్సిజన్ పడకలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. సీఎం సూచనల మేరకు వైద్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించాం’’.
-హరీశ్ రావు, ఆరోగ్యశాఖ మంత్రి
కుల, మత, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని హరిశ్ రావు పునరుద్ఘాటించారు. ఎన్నికల హామీల్లో ఇవ్వని పథకాలు సైతం అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Fever Survey in Telangana: ఫీవర్ సర్వే ఎలా సాగుతోంది ?.. పరిశీలించిన మంత్రులు