సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ధర్నాకి దిగారు. క్వింటాకి రూ.2,500 ప్రకటించి... కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యతా సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో చౌరస్తాలో కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ రెహ్మాన్, ఏసీపీ మహేందర్ రైతులకు నచ్చ చెప్పినా ఆందోళన విరమించలేదు.
ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఫోన్లో అధికారులతో మాట్లాడి రైతుల సమస్య గురించి మాట్లాడడానికి క్యాంపు కార్యాలయానికి సాయంత్రం రమ్మనడంతో ఆందోళన విరమించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనతో 60 శాతం సన్నరకం వరిని పండించామని, సన్నాల సాగుతో ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెట్టి నష్టపోయారని రైతు సంఘాలు పేర్కొన్నాయి. అదనపు ధరను చెల్లిస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆచరణలోకి రాలేదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్న రకం వరి ధాన్యం వల్ల ఎకరానికి 32 క్వింటాళ్లు రావాల్సింది... 16 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని అన్నదాతలు వాపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వైభవంగా సదర్ ఉత్సవాలు... దులియా దున్నరాజు ప్రత్యేక ఆకర్షణ