సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన కుమ్మరి దేవయ్య, మురళిలకు గ్రామంలోని 1452 సర్వే నంబరులో ఏడెకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు తమ పేరిట ఉన్నా.. అదే ఊరికి చెందిన తండ్రీకొడుకులు మద్దెల కిష్టయ్య, నర్సింలు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని గతంలో ఠాణాలో ఫిర్యాదు చేయడమే కాకుండా.. సిద్దిపేట కోర్టులో కేసు వేశారు. ఆ భూమి తమకు చెందినదేనని.. సాగు చేసుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిందని దేవయ్య, మురళి చెప్పారు.
పోలీసుల రక్షణలో భూమిని స్వాధీనం చేసుకోవాలని భావించిన బాధితులిద్దరూ శుక్రవారం ఏసీపీ రామేశ్వర్‌కు విన్నవించారు. ఆయన పరిశీలించి.. తండ్రీకొడుకులు సాగు చేస్తున్నందున ఆ భూమి వారికే దక్కుతుందని చెప్పి వెళ్లిపోయారు. పోలీస్‌స్టేషన్ వద్దకు బాధితులిద్దరూ వచ్చి మనస్తాపంతో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అక్కడున్న సిబ్బంది వారిని నిలువరించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని.. అర్హులైన పట్టాదారులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ సుజాత చెప్పారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బలవన్మరణానికి యత్నించారని దేవయ్య, మురళిపై కేసులు నమోదు చేశామని మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.