కాళేశ్వరం కమీషన్ల ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆమె మాట్లాడారు. తెరాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ.. ప్రజా సమస్యలపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న పరిస్థితుల్లో పాత నిర్మాణాలను కూల్చివేసి కొత్తవి నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని ఆమె ప్రశ్నించారు. ఎస్సీలను ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్.. ఎస్సీలకు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా తొలగించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి పథకం ఎక్కడా అమలు జరగడం లేదన్నారు.
ఎన్నికల సమయంలో మంత్రి హరీష్ రావు తనకు సిద్దిపేట ఓ కన్ను.. దుబ్బాక ఓ కన్ను.. అంటూ ప్రచారం చేస్తున్నారే తప్ప, ఆయనకు సిద్దిపేట వైపు ఉన్న కన్ను మాత్రమే పనిచేస్తుందన్నారు. గజ్వేల్, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి పనులు దుబ్బాకలో ఇప్పటివరకు ఎందుకు జరగడం లేదన్నారు. దుబ్బాక ప్రజలు ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నారు.
ఇవీ చూడండి: బతుకమ్మ చీరల కోసం ఎమ్మెల్యే ముందు ముష్టియుద్ధం