సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మర్కూక్ మండలంలోని ఎర్రవల్లిలో 1800 జనాభా, 430 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో ప్రతి ఇంటివద్ద ఇంకుడు గుంత నిర్మాణాలు కన్పిస్తాయి. అన్ని వీధుల్లో సీసీ రహదారులు, మురుగు కాల్వలు నిర్మించారు. ప్రతి ఇంటి వద్ద చెత్త బుట్టను ఏర్పాటు చేశారు. రోజూ ఉత్పన్నమయ్యే చెత్తను పారిశుద్ధ్య కార్మికులు వాహనంలో తరలించి డంపింగ్ యార్డులో పడవేస్తారు. ఎవరైనా చెత్త రోడ్డుపై వేస్తే వారికి అభివృద్ధి కమిటీ సభ్యులు జరిమానా విధిస్తుండటంతో గ్రామస్థులెవరూ రోడ్డుపై చెత్త వేయడం లేదు. ఫలితంగా గ్రామంలో పరిసరాలు ఎటు చూసినా శుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
2019 జనవరిలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లిని సందర్శించిన కేంద్ర కమిటీ బృందం గ్రామాన్ని దేశంలోనే సంపూర్ణ పరిశుభ్ర గ్రామంగా ఎంపిక చేశారు. 2019 ఫిబ్రవరి 12న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచి మొండి భాగ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా స్వచ్ఛశక్తి సుందర్ గ్రామ పురస్కారాన్ని అందుకున్నారు. వ్యక్తిగత విభాగంలో గ్రామానికి చెందిన మొండి భిక్షపతి స్వచ్ఛసుందర్ శౌచాలయ అవార్డు అందుకున్నారు. గ్రామంలో శ్రమదానం కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి నేటివరకు నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తున్నారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తి, గ్రామస్థుల సహకారంతో శ్రమదానాన్ని ఇలాగే కొనసాగిస్తామని సర్పంచి భాగ్య తెలిపారు.
ఇదీ చూడండి:వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం