సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని హోరాహోరీగా తలపడుతున్నాయి. జోరుగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డాయి. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున మంత్రి హరీశ్‌రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
గెలుపుపై తెరాస ధీమా
అంతా తానై శ్రేణులను ముందుకు హరీశ్‌రావు నడిపిస్తున్నారు. గోబెల్ ప్రచారాన్ని నమ్ముకుని... భాజపా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని... మంత్రి ఆరోపించారు. బీడీ కార్మికులకు అందిస్తున్న పింఛనులో కేంద్రం వాటా ఉన్నట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా విజయం తెరాసదే అని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్
ఈ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు స్థానికంగానే మకాం వేసి మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక నుంచే తెరాస పాలనకు నిశ్శబ్ద విప్లవం మొదలుకావాలని ఉత్తమ్ అన్నారు.
భాజపా జోరు
గతంలో దుబ్బాక నుంచి భాజపా తరఫున రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్‌రావు మూడోసారి బరిలో ఉన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని దుబ్బాక ఓటర్లను కోరుతున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం తారస్థాయికి చేరుతోంది. సవాళ్లు, విమర్శలతో నేతలు రాజకీయ వేడి పెంచుతున్నారు.