సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో కమలం పువ్వు గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని భాజపా అభ్యర్థి రఘునందన్ రావు కోరారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం తోగుట మండలంలోని వరదరాజపల్లి, గోవర్ధనగిరి, గుడికందుల, ఘనపూర్, కాన్గల్, లింగంపేట, జప్తి లింగారెడ్డిపల్లి, బండారుపల్లి, పెద్దమాసాన్ పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్, మార్కెట్ చట్టాలపై తెరాస ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని రఘునందన్ రావు విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం బిల్లులో ఎక్కడ ఉందో చూపించాలని.. తెరాస నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. ఈ బిల్లులో రైతులకు నష్టం జరిగితే ప్రజలు వేసే శిక్షకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపిస్తే సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల మాదిరిగా దుబ్బాక నియోజక వర్గాన్ని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్, సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన విధంగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల పరిహారానికి కృషి చేస్తానన్నారు. తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తెరాసకు గుణపాఠం చెప్పండి'