దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఐపీఎల్ మ్యాచ్‌ను తలపించింది. నాలుగు బంతుల్లో 20 పరుగులు చేయాలన్నట్లుగా టఫ్ టాస్క్‌తో సాగింది. రౌండ్లవారీగా ఫలితం ఊగిసలాడింది. తొలుత భాజపా ఆధిక్యం ప్రదర్శించి గులాబీ శ్రేణులకు చెమటలు పట్టించింది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో కొంత పుంజుకున్న తెరాస.. గెలుపుపై ఆశలు నిలుపుకుంది. చివరకు మళ్లీ కమలదళం గులాబీని కంగారు పెట్టించింది. స్వల్ప మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయబావుటా ఎగురవేశారు. కమలం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
రౌండ్లలో హోరాహోరీ...
రౌండ్ల వారీగా హోరాహోరీగా సాగిన పోరులో.. భాజపాపై తెరాస భారీ ఆధిక్యాలు సాధించలేకపోయింది. భాజపా అభ్యర్థికి కొన్ని రౌండ్లలో వెయ్యికిపైగా ఆధిక్యాలు దక్కగా.. తెరాస పెద్దగా ఓట్లు కొల్లగొట్టలేక పోయింది. ఏ రౌండ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆధిక్యాలు రాలేదు. ప్రతి రౌండ్‌లోనూ కేవలం వందల్లోపై తేడాలు వచ్చాయి. ఉపఎన్నికల ఫలితాల్లో తెరాస అనూహ్యంగా ఓటమి చవిచూసింది. మొత్తం 23 రౌండ్లలో భాజపా 12 రౌండ్లలో ఆధిక్యం చూపగా.. తెరాసకు 10 రౌండ్లలో ఆధిక్యం దక్కింది. కేవలం 12వ రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం చూపినా.. ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ నిర్మానుష్యంగా మారింది. రెండోస్థానం ఉనికిని కోల్పోయింది.
నైరాష్యంలో తెరాస శ్రేణులు...
తెరాస రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లోనూ ఎలాంటి హడావుడి కనిపించలేదు. చివరి వరకు విజయం దోబూచులాడగా.. సంబరాల కోసం సిద్ధమైన కొందరు నేతలు సైతం నైరాష్యంతో కనిపించారు. ఉపఎన్నికల ఫలితాలను గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్న తరుణంలో ఉపఎన్నికల ఫలితాలు తెరాసకు చేదు గుళికను తినిపించాయి.