సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో ఇంటింటికీ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. "నేస్తం" స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ప్రారంభించారు. ఉచిత మాస్కులు పంపిణీ చేస్తోన్న నేస్తం స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని బట్టి సంస్థ నిర్వాహకులను అభినందించారు.
స్వీయ నియంత్ర తప్పనిసరి...
ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి, శానిటైజర్లను ఉపయోగించాలని ఏసీపీ సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే బయటికి రావాలని... తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.
కరోనా సోకితే హోం ఐసోలేషన్...
ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్ వైరస్ సోకినా భయపడకుండా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటే వ్యాధి తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఏసీపీ ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలోనూ యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
గ్రామంలో 1200 మాస్కుల వితరణ..
కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్లను ఉపయోగించాలని నేస్తం సొసైటీ అధ్యక్షుడు మడప జీవన్ రెడ్డి కోరారు. ఈ ఉద్దేశంతోనే గ్రామంలో 1200 మాస్కులు, శానీటైజర్లలను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి, ఉపాధ్యక్షులు బండి వంశీ, రంజిత్, సభ్యులు అయిలేని రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కేసిరెడ్డి రామచంద్ర రెడ్డి, గ్రామ యువత, మహిళలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్