సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు దుకాణ సముదాయాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వలస కూలీలు నిర్మించుకున్న రేకుల షెడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.
ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినటం వల్ల చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గాలివాన బీభత్సం వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.