CM KCR Speech at Siddipet Praja Ashirwada Sabha : ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు హుస్నాబాద్, రెండో రోజు జనగామ, భువనగిరి సభలకు హాజరైన కేసీఆర్.. పార్టీ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో రోజైన నేడు సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట సభలో ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'
BRS Public Meeting in Siddipet : సిద్దిపేట పేరు వింటే స్వర్గం కంటే నా జన్మభూమి గొప్పదనే భావన కలుగుతుందని కేసీఆర్ అన్నారు. ప్రతీ సందర్భంలో సిద్దిపేట తనను విజేతగా నిలబెట్టిందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేటలో మంచినీళ్ల కరవు వస్తే.. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది అని వివరించారు. సిద్దిపేటలో తాను తిరగని రోడ్డు, గ్రామం, చెరువు లేదన్న సీఎం.. ఒకప్పుడు బంగారం లాంటి భూములు ఉన్నా పంటలు పండించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిందే సిద్దిపేట గడ్డ అన్నారు. 50 సంవత్సరాల పాటు సిద్దిపేట ప్రజలతో కలిసి మెలిసి బతికానని చెప్పారు.
కేంద్రమంత్రిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆరడుగుల బుల్లెట్ హరీశ్‌రావును ప్రజలకు అప్పగించానని.. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా తాను ఉన్నా హరీశ్‌రావు మాదిరి అభివృద్ధి చేయలేక పోయేవాడినని కేసీఆర్ అన్నారు. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయన్న ఆయన.. సిద్దిపేటకు హరీశ్‌రావు పట్టుబట్టి ఐటీ హబ్‌ను తెచ్చారని వివరించారు. రాష్ట్రంలోనే సిద్దిపేట అంటేనే ఒక గౌరవం, ప్రత్యేకత ఉంటుందన్న ఆయన.. గత ఎన్నికల్లో లక్ష పైచిలుకు మెజార్టీతో హరీశ్‌రావును గెలిపించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేటలో ఎమ్మెల్యేగా నేను ఉన్నా.. హరీశ్‌రావు మాదిరి అభివృద్ధి చేయలేకపోయేవాడిని. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. సిద్దిపేటకు హరీశ్‌రావు పట్టుబట్టి ఐటీ హబ్‌ను తెచ్చారు. రాష్ట్రంలోనే సిద్దిపేట అంటేనే ఒక గౌరవం, ప్రత్యేకత. గత ఎన్నికల్లో లక్ష పైచిలుకు మెజార్టీతో హరీశ్‌రావును గెలిపించారు. ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును బద్దలుకొట్టాలి. ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు ఇవ్వడమే కేసీఆర్ లక్ష్యం. దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం.. నిరంతరం సాగే పథకాలు. విడతల వారీగా అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తాం. - సీఎం కేసీఆర్
CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..
అనంతరం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజల అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు. దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం నిరంతరం సాగే పథకాలన్న కేసీఆర్.. విడతల వారీగా అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు.
శ్వాస ఉన్నంత వరకు రుణపడి ఉంటా..: బుల్లెట్ వేగంతో సిద్దిపేట రైలు మార్గాన్ని పూర్తి చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. దశాబ్దం క్రితం రాష్ట్రంలో కరవు తాండవించిందన్న మంత్రి.. ప్రస్తుతం 10 రాష్ట్రాలకు తెలంగాణ అన్నం పెడుతుందని వివరించారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లను ఇచ్చి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. సీఎంగా ఉన్నప్పటికీ.. రైతుబిడ్డ కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారని.. రైతుల్లో సీఎం కేసీఆర్ ధైర్యం పెంచారని అన్నారు. తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరే ఉందన్న హరీశ్‌రావు.. వేసవిలోనూ చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటలో కరవు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించారన్నారు. ఈ క్రమంలోనే తనకు శ్వాస ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కు, సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.