BJP MLA Raghunandan inappropriate comments on TRS ministers: రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని దుబ్బాకలో తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. దుబ్బాక పురపాలక అధ్యక్షురాలు గన్నే వనిత ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. రఘునందన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా ఎమ్మెల్యే వెంటనే మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపూరంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనికి పోటీగా ఎమ్మెల్యే రఘునందన్ రావుకు తెరాస నాయకులే క్షమాపణ చెప్పాలంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ దిష్టిబొమ్మలను కమలదళ నాయకులు దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న తెరాస శ్రేణులు రఘునందన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువురు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దుబ్బాక బస్టాండ్ వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. అయితే రోడ్డుపై బైఠాయించి తెరాస శ్రేణులు నినాదాలు చేస్తున్న వారిని ఏమీ అనని పోలీసులు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అడ్డుకున్నారని భాజపా కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో కాసేపు పోలీసులకు, భాజపా శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి బొంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: