Biogas in siddipet plant: సిద్దిపేట పురపాలిక స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణలో తనదైన ముద్ర వేస్తోంది. రాష్ట్రం చూపును తనవైపు తిప్పుకుంటోంది. ఇటీవల జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అయితే మున్సిపాలిటీలో ఉత్పత్తి అవుతున్న తడిచెత్తతో బయోగ్యాస్ (Biogas in siddipet) ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో పట్టణ శివారులోని బుస్సాపూర్ డంపింగ్ యార్డ్‌లో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.ఆరు కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టగా ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగాత్మక పరిశీలన చేసిన అనంతరం పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తడిచెత్త ద్వారా బయోగ్యాస్
పట్టణంలో ప్రస్తుతం నిత్యం 55 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా అందులో 30 మెట్రిక్ టన్నుల వరకు తడి చెత్త ఉంటుంది. రోజువారీగా బయోగ్యాస్ ఉత్పత్తి 10 నుంచి 20 టన్నులు సరఫరా చేయనున్నారు. ప్లాంటులో ఒక టన్ను నుంచి దాదాపు 30 కేజీల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ లెక్కన 350 నుంచి 450 కిలోల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ గ్యాస్‌ను 6.2 కేజీల సామర్థ్యమున్న సిలిండర్లలో నింపి విక్రయించనున్నారు. ప్లాంట్ పూర్తయిన తర్వాత నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించనున్నట్లు పురపాలక అధికారులు తెలిపారు. గ్యాస్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయంలో 75 శాతం సదరు కంపెనీ తీసుకోగా.. 25 శాతం మేర ఆదాయం సిద్దిపేట బల్దియాకు సమకూరుతుందని అధికారులు వెల్లడించారు.
బయోగ్యాస్ తయారీ విధానం ఇలా...
ప్లాంట్‌లో తడి చెత్తను మొత్తం నాలుగు ఐదు దశల్లో శుద్ధి చేసిన అనంతరం గ్యాస్ ఉత్పత్తి చేస్తారు. మొదట పట్టణం నుంచి తడి చెత్తను ప్లాంట్‌కి తీసుకెళ్లి అక్కడి క్రషింగ్ యంత్రంలో వేసి పొడిగా మారుస్తారు. అనంతరం పైపుల ద్వారా ఫ్రీ డైజెస్టర్ అనే ట్యాంకులోకి పంపిస్తారు. అక్కడ మూడు రోజులపాటు నిల్వ ఉంచి చిక్కటి ద్రావణంలా మారుస్తారు. ఆ తర్వాత దానిని పక్కనే ఉన్న మరో భారీ ట్యాంక్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి స్లరీ ట్యాంకు, బలూన్ కంటెయినర్లలో మరింత శుద్ధి చేస్తారు. చివరగా కంప్రెషన్ మిషన్‌లోకి ద్రావణం చేరిన తర్వాత విడుదలయ్యే మీథేన్ గ్యాస్ నుంచి బయోగ్యాస్‌ని వేరు చేస్తారు. అనంతరం సిలిండర్లలో నింపి విక్రయానికి సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వ్యర్థాలతో ఎరువును తయారు చేయనున్నారు. ఈ ప్రక్రియను తొలిసారి చేపట్టినప్పుడు మొత్తం 25 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు కొనసాగుతోందని తెలిపారు.
ఇదీ చూడండి: