తరచూ పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు.. చోదకులను కంగారు పెడుతున్నాయి. ఈ తరుణంలో పలువురు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. బ్యాటరీ వాహనాలపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఓ యువకుడు మాత్రం అందుబాటులో ఉన్న వస్తువులతో స్వయంగా బ్యాటరీ ఆధారంగా నడిచే సైకిల్(battery cycle)ను తయారీ చేశాడు. అతనే సిద్దిపేటకు చెందిన ఎండీ మోసిన్. పెద్దగా చదువుకోని ఇతను బ్యాటరీలను విక్రయిస్తూ వాటిని వాహనాలకు అమర్చుతుంటారు.
పట్టణంలోని పాత సామాన్ల దుకాణంలో 24 ఓల్టేజీల మోటారు, అనుసంధానంగా సెన్సర్ బోర్డు, హ్యాండిల్ గ్రిప్‌లు కనిపించగా సేకరించారు. ఇదే క్రమంలో ఓ పాత సైకిల్ కొనుగోలు చేశారు. తన దుకాణంలో ఉండే 12 ఓల్టేజీతో కూడిన 32 యాంప్స్ సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలు (కొత్తవి) సిద్ధం చేసుకున్నారు. బ్యాటరీలు సైకిల్ పెడళ్లకు ఇరువైపులా అమర్చారు. దీనికి ఆధారంగా రెండు స్టాండ్లను ఏర్పాటు చేశారు. వెనుక చక్రం మధ్యన మోటారు బిగించారు. ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉన్న సెన్సర్ ద్వారా బ్యాటరీ సైకిల్ స్టార్ట్ చేయగానే ముందుకు కదలడం ఆరంభమైంది. ‘రెండు బ్యాటరీలను మూడు గంటలు ఛార్జింగ్ చేస్తే 40 కి.మీ. వరకు ప్రయాణించవచ్ఛు గంటకు 20 కి.మీ. వేగంతో ముందుకు సాగవచ్ఛు విడిభాగాల కొనుగోళ్లకు రూ.8 వేల వరకు ఖర్చయింది..’ అని మోసిన్ చెబుతున్నారు.
ఇదీ చూడండి: నీ ఇన్స్టా ఫొటో మార్ఫింగ్ చేశా.. డబ్బివ్వకపోతే వైరల్ చేస్తా!