సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలోని డీ బ్లాకులో ఏర్పాటు చేసిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య పరిశీలించారు. ఈ నెల 10న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్లికేరి ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
బ్రాండ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు వీడియోగ్రఫీ చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో రౌండ్ వారీగా పొందుపరుస్తామని వివరించారు. నవంబర్ 10న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని.. ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరగంట తర్వాత ఈవీఏంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఆర్వో పేర్కొన్నారు.
కౌంటింగ్ చేపట్టే అధికారిక సిబ్బంది నియామకం, వారికి శిక్షణ సైతం పూర్తయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ విజయ్, డీపీఆర్వో దశరథం, రేడియో ఇంజినీర్ గోపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కేంద్ర నిధులు కేటాయిస్తున్నా అసత్యాలు చెబుతున్నారు'