సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుక మాఫియా దందాలు నిర్వహిస్తుండగా... అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గ్రామపంచాయతీ, మండల అధికారులు కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇసుక తవ్వకాలతో వాగులో ఏర్పడిన ప్రమాదకర గుంతల్లో పడి గత ఏడాది కార్తీక పౌర్ణమి రోజున వాగులో స్నానం కోసం వెళ్లి ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంవత్సరం కూడా వాగులో మళ్లీ అదే ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణా, డంపింగ్ విషయంలో వార్త కవర్ చేసేందుకు వెళ్లిన పత్రికా విలేకర్లనే బెదిరిస్తున్నారు ఇసుక దళారులు.
గ్రామపరిధిలో ఎవరికి తెలియని ప్రాంతంలో ఇసుక డంపులు పోసి గుట్టు చప్పుడు కాకుండా రాత్రి పూట బొలెరో, లారీల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. లక్షల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాగు సమీపంలో ఉన్న రైతులు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత