సిద్దిపేట బల్దియా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేవలం నాలుగు గంటల్లో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మొదటి రౌండ్లో 1 నుంచి 21 వార్డుల వరకు.. రెండో రౌండ్లో 22 నుంచి 43వార్డుల వరకు ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం రెండు హాళ్లలో ఒకేసారి 22 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
కరోనా నిబంధనలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. సిబ్బంది భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. టేబుళ్ల మధ్య ప్లాస్టిక్ కవర్లతో తెరలు వేశారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే విధులు కేటాయించారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కరోనా నివారణ కోసం పోలీసులు కట్టిదిట్టమైన చర్యలు చేపట్టారు. 310 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్లు లెక్కించే ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి కిలోమీటర్ దూరం వరకు కఠిన ఆంక్షలు విధించారు. సిద్దిపేట పట్టణంలో నేటి నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు 144 సెక్షన్ విధించారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, ధర్నాలపై నిషేధం ఉందని.. ఎవరైనా దీనిని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఫలితాలపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. పట్టణంలో మొత్తం 43 వార్డులు ఉండగా.. తెరాస అన్ని వార్డుల్లో.. భాజపా 40, కాంగ్రెస్ 30, ఎంఐఎం 4 వార్డుల్లో, సీపీఎం, సీపీఐ ఒక్కో వార్డులో పోటీ చేశాయి. ఈసారి 67.08 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 4.31 శాతం తక్కువ నమోదైంది. తగ్గిన పోలింగ్ ఎవరికి మేలు చేస్తుందో అని పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో సిద్దిపేట ప్రజల తీర్పు వెలువడనుంది.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణంలోని 12వ వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ఓట్లు సైతం నేడే లెక్కించనున్నారు.