1969 ఉద్యమానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేటలో ‘సమరస్ఫూర్తికి స్వర్ణోత్సవం’ సభను ఆదివారం నిర్వహించారు. అప్పటి ఉద్యమంలో కదం తొక్కిన జిల్లాకు చెందిన దాదాపు 70 మంది ఉద్యమకారులను సన్మానించారు. అప్పటి ఉద్యమకారులు మలివిడత ఉద్యమానికి మార్గదర్శకులని హరీశ్‌రావు చెప్పారు. 2001లో సిద్దిపేట గడ్డ నుంచి కేసీఆర్ మలివిడత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జయశంకర్ సార్ ఉద్యమ భావజాలాన్ని పుస్తకాల ద్వారా సజీవంగా ఉంచారన్నారు. అప్పటి ఉద్యమకారులను సన్మానించి వారి స్ఫూర్తిని పదిలంగా ఉంచాలనేది తమ ఆశయమని చెప్పారు. అన్నాబత్తుల రవీంద్రనాథ్, జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, మల్లికార్జున్, మదన్‌మోహన్ వంటి వారు నాడు కదం తొక్కారన్నారు. కవిత్వం ద్వారా కాళోజి నారాయణరావు ప్రేరణ కలిగించారని తెలిపారు. 1969లో 369మంది మరణించారని లెక్కలున్నా, అంతకుమించి చనిపోయారన్నారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తమకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇస్తే బాగుండేదని 1969 ఉద్యమకారులు కోరారని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్, రఘోత్తంరెడ్డి, కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పాపయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఈ 'అఖండ జ్యోతి' వయసు 230 ఏళ్లు