వ్యవసాయ పనులు జరిగే రోజుల్లో... ఆ అలసటనీ, కష్టాన్ని మరిచిపోయి పని చేయడానికి గ్రామీణుల దగ్గరున్న బలమైన ఆయుధం జానపదాలు(Telugu Janapadalu). ఇవి పూర్వీకుల అనుభవ జ్ఞానం మనకందడానికి వాహకాలు కూడా. అలాంటి అద్భుతమైన ఆ పల్లెపదాలని బతికించుకునే పనిని యజ్ఞంలా చేస్తున్నారు జహీరాబాద్ మహిళలు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చిరుధాన్యాలకు ప్రసిద్ధి. పాత పంటలను కాపాడటం, ప్రస్తుత తరానికి వీటి గొప్పదనం తెలిసేలా చూసే లక్ష్యంతో ఇక్కడి మహిళా రైతులు స్వేదం చిందిస్తున్నారు. వీరు సాగు విషయాలను తోటి రైతులతో పంచుకునేందుకు పాట(Telugu Janapadalu)నే సాధనంగా చేసుకున్నారు. మృగశిర కార్తె రాగానే సాగుకు సన్నద్ధమవుతుంటారు. ఏ పంటలు వేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఒక మామ.. ఆమె కోడలి సంభాషణను పాటగా వినిపిస్తారు. ‘గడగడ ఉరిమే మిరుగం వచ్చే.... ఏమి పెడదమే చిన్న కోడలా’ అని మామ అడిగితే... ‘గవ్విపెడదమే చిన్న మామా... కోరీకోరీ కొర్రలు పెడదాం... తలచి తలచి తైదలు వేద్దాం’ అంటూ కోడలు చెబుతున్నట్లు సాగే పాట(Telugu Janapadalu)లో ఈ ప్రాంత చిరుధాన్యాలన్నింటి ప్రస్తావనా ఉంటుంది. ‘రెండెడ్ల అరకకట్టి... పచ్చజొన్నపెడితిమమ్మో’ అంటూ సాగే పాట ఇక్కడి పంటలను ఆహారంగా ఎలా ఉపయోగించుకుంటారో చెబుతుంది.
ఆరోగ్య రహస్యం పాటల్లో..
ఇప్పుడు ఎంతోమంది సేంద్రియ వ్యవసాయ విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ ప్రాంత మహిళలు తరాలుగా ఆ విధానాన్నే నమ్ముకున్నారు. ఆ పద్ధతులను భావి తరాలకూ అందించాలని తపన పడుతున్నారు. అందుకే ‘గడ్డమీద భూమున్నా దానా... గంగాకే దర్వాజా దానా’ పాట(Telugu Janapadalu)లో సేంద్రియ సాగు గొప్పదనాన్ని వివరిస్తారు. ఇక్కడి రైతులు ఎవరూ విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాల ముందు బారులుదీరరు. అంతకుముందే పంటలో నాణ్యమైన విత్తనాలను సేకరించి భద్రపర్చుకుంటారు. వాటినే విత్తనాలుగా వాడుకుంటారు. ఈ విషయాన్నే పాటకట్టి ‘మాతాన ఉన్న పెంట ఎరువులు బండినింపి కొట్టినం... దాచుకున్న విత్తనాలనే పంట పెట్టినం’ అంటూ సేంద్రియ ఎరువులపై అవగాహన పెంచుతారు.
900 పాత పాటలు..
ఒకటీ రెండూ కాదు... 900ల పైచిలుకు పాత పాట(Telugu Janapadalu)లను పూర్వీకుల నుంచి మహిళా రైతులు సేకరించారు. వాటితోపాటు సందర్భానికి తగినట్లుగా అప్పటికప్పుడు పాటకట్టడం వీళ్ల ప్రత్యేకత. వంద పాటల్ని వీళ్లే స్వయంగా తయారు చేసుకొని పాడుతున్నారు. ఊళ్లోని వృద్ధులు ఎవరైనా బాగా పాడతారని తెలిస్తే... వెళ్లి వారికి తెలిసిన పాటలన్నీ సేకరించి భద్రపరుస్తుంటారు. ఇందుకోసం డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) రేడియో కేంద్రాన్ని వాడుకుంటారు. ఇక్కడ వెయ్యికి పైగా పాటలను రికార్డు చేసి ఉంచారు. ఊళ్లల్లో ఏ కార్యక్రమాలు జరిగినా... తప్పని సరిగా స్త్రీలు పాటలు పాడతారు. ఆ పాటలు వింటే అవగాహన పెరగడమే కాదు సరికొత్త ఉత్సాహమూ మనసంతా నిండుతుంది. పండు వృద్ధురాలి నుంచి కొత్త కోడలి వరకు ఎవరు గొంతెత్తినా చాలు... ఈ ప్రాంత ప్రత్యేకత, సాగు తీరు తదితరాలన్నీ వారి పాటల్లో సజీవంగా వినిపిస్తాయి.
‘ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిని ముందు తరాలకూ అందించాలనేది మా లక్ష్యం. అందుకే పాటలు కట్టడమే కాదు.. వాటిని దాచిపెడతాం కూడా. సాగు గురించే కాదు.. పెళ్లిళ్లు, తొట్టెల పండగలు కార్యక్రమం ఏదైనా తగినట్లుగా పాటలు పాడుతుంటాం. ఈ పని మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’ అంటూ ఆనందంగా చెబుతున్నారు ఈ పాటల తోటలో భాగస్వామురాలైన నాలుగిండ్ల నర్సమ్మ అనే మహిళా రైతు.