ఓ యువతిని ప్రేమించాడు.. ఫోన్లో మాట్లాడేవాడు.. అకస్మాత్తుగా ఆ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జరిగింది. చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన శ్యామ్దాస్ అనే యువకుడు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం శ్రీనివాస ల్యాబ్ పరిశ్రమలో సహాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలో ఇద్దరు స్నేహితులతో కలసి గదిలో అద్దెకు ఉంటున్నాడు. గత నెల 29న తన ఇద్దరు స్నేహితులు ఉదయం ఆరు గంటలకు డ్యూటీకి వెళ్లారు. తను మాత్రం గదిలోనే ఉన్నాడు. తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉదయం విధుల కోసం వెళ్లిన స్నేహితులు రాత్రి వచ్చి చూసేసరికి స్నేహితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత కొంతకాలంగా మృతుడు తన గ్రామానికి చెందిన ఓ యువతితో ఫోన్లో మాట్లాడేవాడని.. అతడు ఆ అమ్మాయిని ప్రేమించాడని మృతుడి స్నేహితుడు కన్నయ్య చెప్పాడు. తన ప్రేమ విఫలం కావడం వల్లే ఉరేసుకుని చనిపోయి ఉంటాడని తెలిపాడు. మృతదేహాన్ని పోలీసులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం