Banning alcohol in kalvakuntla: కొంత మంది వ్యక్తులు మద్యం తాగి వారి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి కొంత మంది తాగి రోజూ ఇతర వ్యక్తులతో గొడవలు పడుతుంటారు. మద్యంమత్తులో పడి చాలా మంది తమ జీవితాలను, ప్రాణాలను కొల్పోతున్నారు. అయితే ఓ గ్రామంలో మద్యపానం సేవించి గ్రామస్థులు మరణిస్తున్నారని మద్యపానాన్ని పూర్తిగా నిషేధించారు.
మద్యంతో పెరుగుతున్న ఈ దుష్పరిణామాలను తగ్గించాలని నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన యువకులు వారం రోజుల కిందట బెల్ట్ షాపుల యజమానులచే మద్యం సీసాలు పగలగొట్టించారు. అయినప్పటికీ గ్రామంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం జరగడం లేదని తెలుసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం యువకులు, స్వచ్ఛంద సంఘాలు గ్రామ పెద్దలు ఏకమై 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో మద్యపాన నిషేధం చేయాలంటూ ర్యాలీ తీసి ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ తీర్మానానికి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. గ్రామంలో ఎవరు మద్యం అమ్మ వద్దని ఎవరైనా అమ్మితే రూ.10 వేల జరిమానా, మందు కొన్నవారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని పట్టించిన వారికి రూ.2000 నగదు ఇవ్వడం జరుగుతుందని గ్రామంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం ఊరి పెద్దలు ప్రకటించారు.
"మా ఊరులో ఎన్నో రోజుల నుంచి మద్యం తాగ వద్దని అందరికి చెబుతున్నాం. వారం రోజుల క్రితం ఈ మద్యపానాన్ని మా గ్రామంలో నిషేధించాం. అయితే పూర్తిస్థాయిలో జరగలేదు. ఈరోజు నుంచి మా గ్రామంలో స్వచ్ఛందంగా పూర్తిగా నిషేధిస్తూ ర్యాలీ చేశాం. ఎవరైనా మద్యం అమ్మితే పదివేల రూపాయలు జరిమానా అలాగే పట్టించిన వారికి రెండువేల రూపాయలు బహుమతిగా ఇస్తామని గ్రామస్థులందరం తీర్మానించుకొన్నాం. ఈ వారంలో పాక్షికంగా నిర్మూలించినందుకే గ్రామం అంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఇది ఇలానే కొనసాగాలని మేమందరం ఆశిస్తున్నాం." - కల్వకుంట్ల గ్రామస్థుడు
సంగారెడ్డి జిల్లాలో మద్యపాన నిషేధం చేయాలని విద్యార్థుల ర్యాలీ:కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నందున రోడ్డు ప్రమాదాలు, హత్యాచార ఘటనలు జరుగుతున్నాయని.. మద్యపాన నిషేధం కోరుతూ సంగారెడ్డిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. 21 ఏళ్లు నిండని వారికి మద్యం అమ్మడం వల్లనే.. ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: