అధికార పార్టీ నేతల కోసం నిమ్జ్ పేరిట భూసేకరణ చేస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని న్యాల్కల్ మండలంలో నిమ్జ్ పేరిట బలవంతపు భూసేకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. జహీరాబాద్లో నిర్వహించిన రైతుల సమావేశానికి హాజరయ్యారు. రూ.కోటి విలువైన భూములను రూ.10 లక్షలకే సేకరించడం అన్యాయమని కోదండరాం మండిపడ్డారు.
నిమ్జ్ ఏర్పాటు అనేది చట్టవిరుద్ధమైన ప్రయత్నం. ఇది కేవలం వారి నాయకుల భూదాహాన్ని తీర్చేందుకు జరుగుతున్న ప్రయత్నం. దీనిపై మేం దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశాం. కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే కొట్టేయాలని ప్లాన్. పరిశ్రమల పేరుతో అధికార నాయకుల పేర్ల మీద తీసుకుంటారు. ఇలాంటి పద్ధతి మనం నిజాం పాలనలో చూసినం. అట్లాంటి ప్రయత్నమే ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ఎన్జీటీ అనుమతి ఇవ్వలేదు. పర్యావరణశాఖ అనుమతే రాలేదు. మేం అన్ని విధాలుగా పోరాడుతాం.
- కోదండరాం, తెజస అధ్యక్షుడు
నిజాం పాలనలో జాగీర్దార్లు, భూస్వాముల తరహాలో సీఎం కేసీఆర్ పేదల భూములను లాక్కుంటున్నారని కోదండరాం మండిపడ్డారు. రూ.కోటి విలువైన భూములను రూ.10 లక్షలకే సేకరించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా సేకరించిన భూములను స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. సారవంతమైన భూములను నిమ్జ్ కోసం సేకరిస్తే సుప్రీంకోర్టు, హరిత ధర్మాసనాన్ని ఆశ్రయించి అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే దిల్లీకి వెళ్లి పర్యావరణ శాఖ మంత్రిని కలిసి నివేదిక అందించినట్లు గుర్తుచేశారు. నిమ్జ్ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని కోదండరాం తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి: భువనగిరిలో అదృశ్యమై సిద్దిపేటలో శవమై.. స్థలవివాదమా..? పరువు హత్యా..?
పసి బిడ్డను చంపి, మహిళ ఆత్మహత్య.. భర్త మరణవార్త విన్న నిమిషాల్లోనే..