సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటకు చెందిన కార్యదర్శి జగన్నాథ్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో కుటుంబసభ్యులు, పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జగన్నాథ్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం కార్యదర్శులపై చూపిస్తోన్న మొండి వైఖరికి పదుల సంఖ్యలో సెక్రటరీలు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరయ్యే మంత్రులు.. ఈ ఘటనకు సంబంధించి ఎందుకు పరామర్శించలేదని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా కార్యదర్శులు, కుటుంబీకులు ఆందోళన విరమించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: సూసైడ్ నోట్ రాసి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య