సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 30 ఏళ్లుగా చిరుధాన్యాల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తోంది. ఇందులో భాగంగా జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడు మండలాల్లో చిట్టి అడవుల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ శాంతి కుమారి ఎంపిక చేసుకున్న గ్రామాల్లోని పాడుబడిన ప్రభుత్వ భూములను గుర్తించి చిట్టడవులు పెంచారు. ఈ చిట్టడవుల్లో 25 నుంచి 30 రకాల ఔషధ మొక్కలు, ఇతర మూలికల చెట్లను పెంచేలా స్థానిక మహిళలను ప్రోత్సహించారు.
అడవిని నరికి.. ప్రకృతి వనమా?
25ఏళ్ల క్రితం న్యాల్కల్ మండలం గుంజేటిలో చిట్టడవిని పెంచుకునేందుకు అప్పటి సర్పంచి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులకు ఐదెకరాల భూమిని కేటాయించారు. గ్రామానికి చెందిన 30 మంది మహిళలు డీడీఎస్ ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి.. మొక్కలను పెంచుతూ కాపాడుకున్నారు. నాటిన మొక్కలు నీళ్లు లేకుండా ఎండిపోకూడదని.. మూడు కిలోమీటర్ల దూరం నడిచి.. బిందెలతో నీళ్లు తెచ్చి.. మొక్కలకు పోసి.. పెంచి పెద్ద చేశారు. నేడు అవి పెద్ద పెద్ద వృక్షాలుగా ఎదిగాయి. అయితే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఆ చెట్లను నరికి.. అక్కడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి.. చెట్లుగా ఎదిగే వరకు.. వాటిని కన్నబిడ్డల్లా చూసుకున్నామని.. బాగా ఎదిగిన చెట్లను నరికి.. మళ్లీ ప్రకృతి వనం ఏర్పాటు చేయడమేంటని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళలు ప్రశ్నించారు. పల్లె ప్రకృతి వనం కోసం అడవి ధ్వంసం చేయడంపై సంఘం మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు మొక్కల సంరక్షణకై.. కిలోమీటర్ల దూరం నడిచి.. హద్నూర్ చెరువు నుంచి నీళ్ళు తెచ్చి పోశామని.. అంత కష్టపడి పెంచిన చిట్టడవిని ఎలా నాశనం చేస్తారంటూ.. ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఆందోళనకు సిద్ధం!
పల్లె ప్రకృతి వనం కోసం తాము కష్టపడి సృష్టించిన చిట్టడవిని ధ్వంసం చేసి నడకదారి.. ఆట వస్తువులు ఏర్పాటు చేసి.. వినోద కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం సరికాదని డీడీఎస్ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామంలోని ఖాళీ ప్రభుత్వ భూమిలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని.. పాతికేళ్ళ క్రితం చేసిన ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు. తాము నాటుకున్న చిట్టడవి కాపాడుకునేందుకు జిల్లా కలెక్టర్ సహా అవసరమైతే మంత్రులు, ముఖ్యమంత్రిని కలవడానికి కూడా వెనకాడమని అంటున్నారు. గుంజేటి గ్రామంలో చిట్టడివి ధ్వంసం విషయమై జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. చిట్టడవిని వదిలేసి.. కొత్త ప్రదేశంలోనే పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు