ఆర్టీసీ సొంత సిబ్బందితో కొరియర్, పార్సిల్ సర్వీసు ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టం అని మెదక్ రీజియన్ మేనేజర్ రాజశేఖర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో కొరియర్, పార్సిల్ విభాగం సేవలను ఆయన ప్రారంభించారు. కొవిడ్-19తో ఆదాయం లేక సతమతమవుతున్న సంస్థకు అదనపు ఆదాయ మార్గం ఉపక్రమిస్తుందని రీజినల్ మేనేజర్ పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో కొరియర్, పార్సిల్ సేవలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా భయంతో ప్రజలు బస్సులు ఎక్కడం తగ్గించారని.. డ్రైవర్లు, కండక్టర్లు శానిటైజర్ ఉపయోగిస్తూ ప్రయాణికుల్లో భద్రతాభావం పెంచాలని సూచించారు. కొరియర్ సేవలు విస్తృతంగా ప్రజలు వాడుకునేలా సంస్థ ఉద్యోగులు ప్రచారం చేయాలని సలహా ఇచ్చారు. అనంతరం డిపో గ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. బస్సుల శానిటేషన్ విభాగాన్ని పరిశీలించి డీఎం రమేష్, ఎంఎఫ్ అస్లాం పాషాను అభినందించారు.
ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల