చెరువులోకి వరద నీరు స్వేచ్ఛగా వచ్చేలా.. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయం స్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎఫ్టీఎల్( పూర్తి స్థాయి చెరువు నీటి నిల్వ) పరిధిలోని భూముల్లో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలని ఈ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యత నీటి పారుదల, రెవిన్యూ శాఖలపై ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ కొంత మంది అధికారుల నిర్లక్ష్యం, ఇతర కారణాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఈ ఎఫ్టీఎల్ భూములను కనుమరుగు చేస్తున్నారు.
కళ్లకు.. ఖరీదైన స్థలాలు
సంగారెడ్డి పట్టణ శివారులో 161వ జాతీయ రహాదారి పక్కనే మహబూబ్‌సాగర్ చెరువు ఉంది. మూడు వందల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువుకు 260 ఎకరాల ఆయకట్టు ఉంది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఇక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేశారు. మరికొన్ని చేస్తున్నారు. పట్టణానికి పక్కనే ఈ చెరువు ఉండటం వల్ల ఇక్కడ ఎకరా భూమి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పైనే పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కళ్లు ఎఫ్టీఎల్ భూములపై పడ్డాయి. ఆక్రమణకు శ్రీకారం చుట్టారు. కొద్దికొద్దిగా నిర్మాణ వ్యర్థాలు, మట్టితో దానిని నింపేస్తున్నారు.
కుంట కన్నీరు పెడుతుంది
హత్నూరు మండలం చింతల్ చెరువు గ్రామంలో పటాన్చెరు-దౌల్తాబాద్ రోడ్డు పక్కన సాలెవాని కుంట ఉంది. ఈ కుంటకి 20 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ రెండో విడతలో దీన్ని అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు ఈ చెరువులో వెంచర్ వెలుస్తోంది. పట్టపగలే యంత్రాలతో పనులు చేస్తున్నా అడ్డుకునే నాథుడు లేరని.. కుంటను కాపాడాల్సిన రెవిన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూగర్భ జలాలు వెయ్యి అడుగుల కంటే కిందికి పోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులను సంరక్షిస్తే.. భవిష్యత్తులో ఈ నీటి గండంను అధిగమించే అవకాశం ఉంటుందని అంటున్నారు.