అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. జహీరాబాద్ మండలం కొత్తూరు బీ గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద నిర్మించిన ఇళ్లలో అక్రమంగా నిల్వ చేసిన లక్షా 20 వేల విలువైన 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చౌక ధరల దుకాణాలు, రేషన్ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మినీ ట్రక్కుల్లో తీసుకువచ్చి లారీలో నింపుతుండగా.. జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు, తహసీల్దార్ నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ నాయబ్ తహసీల్దార్, బసవయ్య బృందం వారిని పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని జహీరాబాద్ గ్రామీణ పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.