సాధారణంగా.. పొలం పనులు ఎక్కువగా పురుషులే చేస్తారు. పొలం దున్నడం, నీరు పెట్టడం, నారు వేయడం వంటి పనులను మగవాళ్లే చేస్తారు. నాటు(Paddy Plant) విషయానికొస్తే మాత్రం మహిళలే ముందుంటారు. కానీ చేసే పనికి ఆడా, మగ అనే తేడా ఉండదు అని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మగ కూలీలు. మహిళలకు దీటుగా నాటు(Paddy Plant) వేస్తూ రైతులకు కూలీల కొరత తగ్గిస్తున్నారు.
నాట్ల సీజన్ వచ్చిందంటే రాష్ట్రంలో కూలీల కొరత తప్పనిసరిగా ఉంటుంది. గతేడాది రూ.300 నుంచి రూ.400 ఉన్న కూలీ.. ప్రస్తుతం రూ.500 కొన్ని ప్రాంతాల్లో రూ.800 వరకు ఉంది. ఎకరం నాటు వేయాలంటే గతేడాది రూ.3 నుంచి 4 వేలు అయ్యే ఖర్చు.. ఈ ఏడు రూ.6 నుంచి 8వేలకు చేరుకుంది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో రైతులు కూలీల కొరతతో ఇబ్బందులు పడుతుండగా.. యూపీకి చెందిన కూలీల గురించి విన్నారు. సాధారణంగా నాటు(Paddy Plant) మహిళలే వేస్తారు. పురుషులు వేయరు. ముందుగా.. ఈ విషయంలో కాస్త వెనకడుగేసిన రైతులు.. కూలీలు నమ్మకం కలిగించడంతో సరేనన్నారు.
మొత్తం వాళ్లే చూసుకుంటారు..
యూపీకి చెందిన మగ కూలీలు.. ఎకరానికి రూ.4,300 తీసుకుంటూ నాటు వేస్తున్నారు. 16 మందితో కూడిన ఈ బృందం ఉదయం 7.30 గంటలకే పొలానికి చేరుకుంటుంది. నారు తీయడం, నారు మడుల్లో వేయడం అంతా వీరే చూసుకుంటారు. హత్నూర్ మండలంలోని కాసాల, చికమద్దూరు గ్రామాల్లో వీరు నాటు వేస్తున్నారు.
యూపీ కూలీల వల్ల మాకు కూలీల కొరత తగ్గింది. నారు తీయడం, నారు మడుల్లో వేయడం, తాడు పట్టడం అన్ని పనులు వీళ్లే చేస్తారు. కూలీ కూడా తక్కువగానే తీసుకుంటున్నారు. తక్కువ సమయంలో వేగంగా పని చేస్తున్నారు.
- రైతు, హత్నూర్
ఈ పని మేం 20 ఏళ్లుగా చేస్తున్నాం. కానీ అక్కడ మాకు కూలీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం కూలీ రోజుకు రూ.400 వరకు ఇస్తున్నారు. మేం ఎక్కడ నాటు వేసినా.. ఆ రైతుకు మంచి దిగుబడి వస్తుంది.
- యూపీ కూలీ
పెరుగుతున్న డిమాండ్
వీరి రాకతో తమకు కూలీల కొరత తగ్గిందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఏమాత్రం తీసిపోకుండా.. వేగంగా.. నాటు వేస్తున్నారని చెబుతున్నారు. తక్కువ సమయంలో వేగంగా నాటు వేయడం వల్ల చాలా గ్రామాల రైతులు వీరి కోసం పోటీపడుతున్నారు. హత్నూర మండల పరిధిలో ఈ బృందానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది.