సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నిమ్జ్ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ ప్రైవేటు రక్షణరంగ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు కేటీఆర్ రావడాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిమ్జ్ పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భూనిర్వాసితులు ఆరోపించారు.
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో న్యాల్ కల్, ఝరాసంగం మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడిగి, గంగ్వార్, మెటల్‌కుంట, న్యామతాబాద్, రుక్మాపూర్, హుసెళ్లి గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిమ్జ్ భూనిర్వాసితుల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నిమ్జ్ పరిధిలోని గ్రామాల్లో అత్యవసరం ఉంటేనే గ్రామస్థులను పోలీసులు బయటకు పంపిస్తున్నారు. కేటీఆర్ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.