తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డిలోని ఓ కార్యకర్త పోటీ చేస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు కార్యకర్తను వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలో దింపుతానని జగ్గారెడ్డి తెలిపారు. తాను మాత్రం 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.
''వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నా స్థానంలో సంగారెడ్డిలోని కార్యకర్త పోటీ చేస్తారు. పార్టీ శ్రేణులు వద్దంటే.. నా భార్య నిర్మల బరిలో ఉంటారు. నేను 2028ఎన్నికల్లో పోటీ చేస్తా'' - ఎమ్మెల్యే జగ్గారెడ్డి
గతకొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యవహారశైలిపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేశారు. సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదనే ఆరోపణలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి సైతం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధిష్ఠానం పెద్దలతోనూ జగ్గారెడ్డి చర్చించారు. ఆ తర్వాత బహిరంగ విమర్శలు చేయబోనని చెప్పినా.. మళ్లీ రేవంత్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో అంతంతమాత్రంగానే ఉంటున్న ఆయన.. తాజాగా ఎన్నికల్లో పోటీపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'' ప్రజా సమస్యలపై చర్చిద్దామంటే.. అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. కేసీఆర్ సీఎం అయ్యాకా... ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. ఆరు నెలల తర్వాత జరిగే సమావేశాలు మూడు రోజులకే పరిమితమా..? వీఆర్ఏలు రాష్ట్రం వచ్చాక ఆగమయ్యారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించక కేసీఆర్ దేశం తిరుగుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడే వీలుండదు కాబట్టి నేను నిరసన తెలుపుతా. ఈనెల 12న ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ చేస్తాను.'' - ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఇవీ చూడండి: