మంత్రి సత్యవతి రాఠోడ్ మంచి మనసును చాటుకున్నారు. కొవిడ్ మహమ్మారితో భర్త చనిపోయి బతుకు భారమైన ఓ కుటుంబాన్ని చేరదీశారు. ముగ్గురు చిన్న పిల్లల బాగోగులు చూసుకోలేని పరిస్థతి ఉన్న ఇల్లాలిని ఆదుకున్నారు. ఇది సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్‌కు చెందిన పద్మ దైన్యస్థితిపై విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వారి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీసి అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు హుటాహుటిన తరలి వెళ్లిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు... పద్మ పరిస్థితి చూసి చలించారు. పిల్లలను అక్కున చేర్చుకున్నారు. బలహీనంగా ఉండడంతో పిల్లలకు వెంటనే కరోనా పరీక్షలు చేయించారు. కరోనా నెగెటివ్ రావడంతో వెంటనే చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ ప్రత్యేక వాహనంలో ఆమె స్వగ్రామం జోగిపేట సమీపంలోని డాకూర్ గ్రామం చేర్చారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకు ఇచ్చే అంగన్‌వాడీ పోషకాహారం అందించారు. అనంతరం.. ఆ గ్రామ పంచాయతీ సర్పంచితో మాట్లాడి ఆమె పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అంగన్‌వాడీ కేంద్రం పర్యవేక్షణలో వారికి కావల్సిన పూర్తి సంరక్షణ చేపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో స్పందించి చేయూత అందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, గ్రామ సర్పంచిని మంత్రి అభినందించారు.